
bowl- gooseberry sambar
హలొ మిత్రులారా!
అంతా బాగానే వుంది! కానీ బ్లాగింగు మీద కొంత నిస్పృహ, నిస్సత్తువ ఆవరించింది. అందుకే మీకు మొఖం చాటు వేశా!! ఓ అర్ధ శత దినోస్తవం పాటు!!!
కొంత మంది మిత్రులు అడిగారు — “ఏందన్నా ఏమన్నా కరోనా గట్లా ఏమైనా పలకరించిందా” ! మాట మంతి లేకుండా గమ్మున మీ పాటికి మీరు వున్నారు! అని
వాళ్లందరికి ఎదో ఒక ముచ్చట చెప్పి! తప్పించుకున్నా!! అప్పటికి !!!
ఈ లొల్లి కన్నా! ఈ డిసెంబర్ నుంచి రాసుడే మంచిదని! షురూ చేశా!
శ్రీ రఘురామ చారు తులసీ దలధామ శమక్షమాది శృం
గార గుణాభిరామః త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామః జగజ్జనకల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
( దాశరథీ శతక రచయతకి కృతజ్ఞలతో ..మరియు పాద పద్మములకు ప్రణామములతో)

class room
చిన్నపుడు బాగా వల్లే వేసిన పద్యం, భక్తి శ్రద్దలతో తెలుగు మాస్టారుతో కలిసి అనేక సార్లు పాడిన పద్యం.
అయితే! ఈ పద్యంలో వున్న చారు! తులసి అని విన్నప్పుడు. జప్తికి వచ్చే ఓ సంఘటన!
“తులసి దళములతో చారు” కాచి త్రాగిన రాములు వారు మంచి తేజస్సు పొంది, శక్తి గడించి “రాక్షసులందరిని” సంహరించారు! అని ఓ శుంఠ పలికిన తాత్పర్యము.
ఇది విన్న తెలుగు మాస్టార్ “డస్టర్” విసిరి ఆ “శుంఠ” తలకి “బొప్పి” కట్టించారు! ఆ “శుంఠ” ని నేనే !! అని మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదను కొంటా!!!
తెలుగు, ఇంగ్లీష్, హిందీ త్రిభాషా పండితుల చేత తన్నులు తిన్న వాడిని. బాషా బేధం లేదు నాకు! ఈ విషయం లో (తన్నులు తినటం లో)
మరో మారు నా స్కూల్ ఫీట్స్ వివరిస్తా! చాలానే వున్నాయి!
ఇప్పడు ఓ మహత్తరమైన రుచికరమైన, ఆరోగ్య దాయిని అయిన “చారు” గురుంచి తెలుసుకొందాం!
కరోనా దెబ్బకు “ఇమ్యూన్” అనే మాట విశ్వ వ్యాప్తమైనది. ఈ చారు “ఇమ్యూన్” ని ఇనుమడింప చేసి ఆరోగ్యాన్ని పెంపొందించే “ఆహారం” గా ఆరోగ్య నిపుణలుచే చూచించబడింది.

Indian Gooseberry (Amla)
ఈ చారు తయారీకి కావాల్సిన పదార్ధములు : ఉసిరికాయలు – 150 గ్రాములు, కంది పప్పు 75 గ్రాములు, సాంబారు పొడి (మసాలా) – 20 గ్రాములు, పసుపు- అర స్పూన్ , ఇంగువ – అర స్పూన్, పచ్చి మిర్చి – 4 , వంట నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు (కొద్దీ కొద్దిగా) కారం – 2 స్పూన్లు, పెద్ద ఉల్లి – 1 , వెల్లుల్లి – 3 రెబ్బలు.
తయారీ విధానం : ఉసిరికాయలను శుభ్రముగా కడిగి పొడి బట్టతో తుడిచి, కత్తి తో ముక్కలుగా కోసుకొని, గింజలు తీసివేయాలి. అవి అన్ని అడుగు మందపాటి గిన్నెలో వేసి నీరు పోసి ముక్కలను మెత్తగా ఉడికించి, మెత్తగా పేస్టులా చేసుకొని పెట్టుకోవాలి.

Daal
కందిపప్పుని శుభ్రముగా కడిగి, బాగా ఉడికించి మెత్తగా రుబ్బుకోవాలి.
ఈ రుబ్బుకొన్న పప్పు ను, ఉసిరి పేస్టులో వున్న మందపాటి గిన్నెలో తీసు కొని, పసుపు, పచ్చి మిర్చి ముక్కలు, కారం వేసి కలిపి సుమారు 1000 ఎం ఎల్ నీళ్లను పోసి బాగా కలియపెట్టి మీడియం ఫ్లేమ్ పై బాగా మరిగించాలి.

Indian spices red and green
ఓ చిన్న గిన్నెలో వంటనూనె ను వేసి కాగిన తరువాత పెద్దవుల్లి ముక్కలు వేసి వేపుకొని దానిలో ఆవాలు,జిలకర, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి వేపుకొని, బాగా తెర్లుతున్న చారులో తాలింపు వేయాలి.
మరి రెండు నిముషాలు మరిగించి, దించేముందు కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా చేసి, వేసి దించి వెయ్యాలి.

Idly- Dosa-Vada
ఈ చారు రైస్ లోకే కాకుండా ఇడ్లి, దోసె, వడ, ఉప్మా లోకి కూడా చాలా బాగుంటుంది.
జ్వరం వచ్చి తాగిన వారు “పత్యం” కింద కూడా ఈ చారును ఆహరం గా తీసుకొన వచ్చు.
తరుచు గా ఈ చారుని ఆహారంగా తీసుకొంటూఉంటే మంచి బలాన్ని కలుగచేయటమే కాకుండా రోగనిరోధక శక్తి పెరిగి “జలుబు, దగ్గు, ఆయాసం” లాంటి తరుణ వ్యాదులనుంచి ఉపశమనం పొందవచ్చు అని ఆహార ఆరోగ్య నిపుణులు సూచన.
ఉసిరి తో అనేక రుచికరమైన వంటలు వున్నాయి అని అందరికి తెలుసు. సులభంగా తాయారు చేసుకొనే పద్ధతులు తెలుపుతూ వాని లో వున్న ఆరోగ్య లక్షణాలు ఒక్కోటి తెలుసుకొందాం.

Tasty and Healthy soup